Monday, 25 November 2013

మహాప్రస్థానం - mahaaprasthanam

మరో ప్రపంచం పిలిచింది!
పదండి ముందుకు! పదండి తొసుకు!
పోదాం, పోదాం, పైపైకి!
కదం తొక్కుతూ,
పదం పాడుతూ, హృదయాంత రాళం గర్జిస్తూ పదండి పోదాం,
వినబడలేదా
మరో ప్రపంచపు జలపాతం?
దారి పొడవునా గుండె నెత్తురులు
తర్పణ చేస్తూ పదండి ముందుకు!
బాటలు నడచీ,
పేటలు కడచీ,
కొటలన్నిటిని దాటండి!
నదినదాలూ,
అడవులు, కొండలు,
ఎడారులా మనకడ్డంకి?
పదండి ముందుకు,
పదండి తొసుకు,
పోదాం, పోదాం, పైపైకి!
ఎముకులు కుళ్లిన,
వయసు మళ్లిన,
సొమరులారా! చావండి!
నెత్తురు మండే,
శక్తులు నిండే,
సైనికులారా! రారండి!
"హరోం! హరోం హర!
హర! హర! హర! హర! హర!
హరోం! హరా!" అని కదలండి!
మరో ప్రపంచం,
మహా ప్రపంచం,
ధరిత్రినిండా నిండింది!
పదండి ముందుకు!
పదండి తోసుకు!
ప్రభంజనం వలె హోరెత్తండీ!
భావవేగమున ప్రసరించండి!
వర్షు కాభ్రముల ప్రళయ ఘోష వలె
పెళ పెళ పెళ పెళ విరుచుకు పడండి!
పదండి,
పదండి,
పదండి ముందుకు!
కనబడలేదా మరొ ప్రపంచపు
కణ కణ మండె త్రేతాగ్ని?
ఎగిరి, ఎగిరి పడుతున్నవి
ఎనభై లక్షల మేరువులు!
తిరిగి తిరిగి తిరిగి సముద్రాల్
జలప్రళాయ నాట్యం చేస్తున్నవి!
సల సల కాగే చమురా?
కాదిది,ఉష్ణ రక్త కాసారం!
శివ సముద్రమూ,
నయాగరావలె
ఉరకండీ! ఉరకండీ ముందుకు!
పదండి ముందుకు!
మరో ప్రపంచపు కంచునగార
విరామమెరుగక మోగింది!
త్రాచులవలెనూ,
రేచులవలెనూ,
ధనంజయునిలా సాగండి!
కనబడలేద మరో ప్రపంచపు
అగ్ని కిరీటపు ధగధగలు,
ఎర్ర బావుటా నిగనిగలు,
హోమజ్వాలల భుగభుగలు?

No comments:

Post a Comment